Sunday, 3 November 2019

సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు జనవరిలో డీఎస్సీ

సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు   జనవరిలో డీఎస్సీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు)/గుంటూరు ఎడ్యుకేషన్‌/మార్కాపురం: విద్యాశాఖలో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఏటా జనవరిలో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యా సంస్కరణలపై ఆదివారం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


తొలుత ఎంఈవోల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా..
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ఎంఈవోలకు జీతాల డ్రాయింగ్‌ పవర్‌ను సైతం ఇచ్చేందుకు త్వరలో జీవో ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. 
ఎంఈవోలకు డీవైఈవోలుగా, డీఈవోలకు జాయింట్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో జరిగిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ 40వ సర్వసభ్య సమావేశంలో మంత్రి సురేష్‌ మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు చేపడతామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల కట్టడికే కమిషన్‌ ఏర్పాటు చేశారనేది కేవలం అపోహేనని కొట్టిపారేశారు. డీఈవో కార్యాలయాల్లో ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు.


ఏకీకృత సర్వీసు సమస్య పరిష్కారానికి కృషి
ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు చేసి ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తెస్తామని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన మీడియాతో చెప్పారు. ఈ నెల 14వ తేదీన 15 వేల పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలోని 45 వేల పాఠశాలలను ఆధునికీకరిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు ఏఎస్‌ రామకృష్ణ, సూర్యారావు, ఎంఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం, ఉపాధ్యక్షుడు సీహెచ్‌పీ వెంకటరెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts