రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూముల రిజిస్ర్టేషన్
మార్పులు జరిగితే.. మొబైల్‌కు సందేశం
మార్పులు జరిగితే.. మొబైల్‌కు సందేశం
- రికార్డు మార్చినా, రిజిస్ట్రేషన్ జరిగినా ఖాతాదారుడికి సమాచారం
- బోగస్ అయితే అధికారులపై చర్యలు
- రిజిస్ట్రేషన్, వెబ్‌ల్యాండ్ సవరణలపై ప్రతిపాదన
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూముల రిజిస్ర్టేషన్ వ్యవహారాన్ని అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనుంది. గుట్టుచప్పుడు కాకుండా అడ్డగోలుగా రికార్డులను మార్చేసే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. రికార్డుల్లో ఎలాంటి సవరణలు చేసినా సంబంధిత ఖాతాదారుల మొబైల్‌కు వెంటనే సంక్షిప్త సందేశం వెళ్లేలా వెబ్‌ల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ చెక్‌ను ఏర్పాటు చేయబోతోంది.
అంతేకాదు... ఏ మండలంలో ఎన్నిసార్లు లాగిన్ అయ్యారు? ఎన్ని ఖాతాలను మార్చారు? ఏ సమయంలో సవరణలు చేపట్టారు అనే వివరాలు తెలుసుకునేందుకు లాగిన్ హిస్టరీని రికార్డు చేసి బ్యాకప్ ఉంచాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. రికార్డుల సవరణలపై వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక నిగూఢమైన నిఘావ్యవస్థలా పనిచేసేలా కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇటీవల రెవెన్యూశాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ అంశం చర్చకొచ్చింది.
తేడా వస్తే చర్యలు
రెవెన్యూ రికార్డులను వెబ్‌ల్యాండ్ నుంచి ప్రతి ఒక్కరు చూడగలిగే పరిస్థితి వచ్చింది. అలాగే, ఖాళీగా ఉన్న ప్రైవేటు, ఎవరూ క్లెయిమ్ చేయని విలువైన భూములు, ఇంకా ప్రభుత్వ పరిధిలోని భూముల గురించి తెలుసుకొని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి వాటి రికార్డులను మార్చేస్తున్నారని రెవెన్యూశాఖ కార్యదర్శి ఉషారాణి ఇటీవల ఆ వర్క్‌షాప్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు యుద్ధప్రాతిపదికన తీసుకురావాలన్నారు. అవి ఎలా ఉండాలో కూడా దిశానిర్దేశం చేశారు. దీనికి రిజిస్ట్రేషన్‌శాఖతో కలిపి మార్పులు చేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌ను రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌తోపాటు బ్యాంకులు, ఇతర శాఖలు ఉపయోగించుకోగలుగుతున్నాయి. కానీ రికార్డుల సవరణలు మాత్రం ఒక్క రెవెన్యూశాఖే చేస్తోంది. ఇకపై, మండల కార్యాలయాల్లో రికార్డుల సవరణకు పూర్తి బాధ్యత తహసీల్దార్‌దే. 'డిజిటల్ కీ'ని కంప్యూటర్ ఆపరేటర్‌కు ఇచ్చి చేయించే సవరణల్లో తప్పులు దొర్లినా, ఉద్దేశపూర్వక తప్పిదాలు చేసినా తహసీల్దార్‌నే బాధ్యులుగా చేస్తారు.
రికార్డుల సవరణ సమయంలో తహసీల్దార్ వేలిముద్ర వేసే విధానం తీసుకురాబోతున్నారు. అయితే, తహసీల్దార్‌లకు పనిభారం ఎక్కువగా ఉంటోన్నందున కొందరు 'డిజిటల్ కీ'ని ఆపరేటర్లకు ఇస్తున్నారని, అలాంటి కేసుల్లో ప్రత్యామ్నాయం చూడాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో, తహసీల్దార్ ఇతర పనులపై బయటకు వెళ్లినప్పుడు 'డిజిటల్ కీ'ని కంప్యూటర్ ఆపరేటర్‌కు బదులు డిప్యూటీ తహసీల్దార్(డీటీ)కు అందించాలని ప్రతిపాదించారు. డీటీ సమక్షంలోనే రికార్డుల సవరణలు జరిగేలా చూడాలని నిర్ణయించారు. దీంతోపాటు ప్రతి మండల ఆఫీసుకు ఒక జూనియర్ అసిస్టెంట్‌పోస్టును త్వరలో మంజూరు చేయనున్నారు. మండల ఆఫీసులో ఏ రికార్డునైనా అధికారి మారిస్తే వెంటనే సంబంధిత ఖాతాదారుని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్లేలా వెబ్‌ల్యాండ్‌లో ఆటోమెసేజ్ సెంట్ అప్షన్ పెట్టాలని నిర్ణయించారు. ఒకవేళ అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా భూమి రికార్డులను మార్చినట్లు ఖాతాదారుడు గుర్తించి ఫిర్యాదు చేస్తే సంబంధిత తహసీల్దార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు. అంతేకాదు... ఇలాంటి కేసులు అదే మండలంలో ఏమైనా జరిగియా అన్నది విచారించడానికి ప్రత్యేకంగా అధికారుల బృందంతో పరిశీలన చేయించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌శాఖలోనూ దాదాపు ఇదే పద్ధతిని తీసుకురావాలని ఆ శాఖ ఐజీ సిద్ధార్థ్ జైన్ ప్రతిపాదించారు. ఈ అంశాలపై త్వరలో రెవెన్యూశాఖ మార్గదర్శకాలు ఇవ్వనుంది.
0 comments:
Post a Comment