ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం వ్యాపార, ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఇక స్టాక్ మార్కెట్ల సంగతి వేరే చెప్పనవసరం లేదు. బడ్జెట్ బాగుంటే మార్కెట్లు తారాజువ్వల్లా పైకి వెళతాయి.. ఆశించిన ఫలితం రాకపోయినా.. మార్కెట్లు పతనం ఖాయం. అసలు ఈ బడ్జెట్ ఏమిటీ.. దీనిని ఎవరు ప్రవేశపెడతారు వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకొందాము.
బడ్జెట్‌ను ప్రాథమికంగా రెండు భాగాలుగా చూస్తారు. మొదటిది రెవెన్యూ బడ్జెట్ కాగా.. రెండో క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయాలు, ఆదాయ మార్గాల్లో మార్పులు వంటివి చేస్తారు. వీటిల్లో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం కూడా ఉంటాయి.
ఇక క్యాపిటల్ బడ్జెట్‌లో మూలధన ఆదాయాలు, అప్పులు, పెట్టుబడి ఉపసంహరణలు, కొత్త ఆస్తుల సృష్టి వంటివి దీని పరిధిలోకి వస్తాయి.
యూనియన్ బడ్జెట్ అంటే ఏమిటీ ?
యూనియన్ బడ్జెట్‌ను ఏటా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. దీనిలో రానున్న ఆర్థిక సంవత్సరానికిగానూ ఆదాయాలు, వ్యయాల అంచనాలను వెల్లడిస్తారు.
బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారు ?
భారత చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలు మారుతూ వచ్చాయి. 2017 నుంచి దీనిని ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడుతున్నారు. అంతకు ముందు దీనిని ఫిబ్రవరి చివరి తేదీన ప్రవేశపెట్టే ఆచారం ఉండేది. దానిని మోదీ ప్రభుత్వం మార్చి మరికొంత ముందుకు తీసుకొచ్చింది.
ఎవరు ప్రవేశపెడతారు..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రాబోయే బడ్జెట్‌ను కూడా ఆమే ప్రవేశపెట్టనున్నారు. తొలి యూనియన్ బడ్జెట్‌ను ఆర్.కె.షణ్ముఖ చెట్టి 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. కానీ, దీనిలో ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.
బడ్జెట్ ప్రతిపాదనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
ప్రతిసారి బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు పార్లమెంట్ ఆమోదం తర్వాత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచే ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అవి తర్వాతి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
0 comments:
Post a Comment