Sunday, 16 August 2020

ప్రభుత్వ బడుల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ చదువులు

 ప్రభుత్వ బడుల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ చదువులు 


బుడిబుడి అడుగులువేసే చిన్నారులు మమ్మీ, డాడీ అంటూ పిలిస్తే పెద్దలు పరవశమవుతున్నారు.. పూర్వ ప్రాథమిక విద్యకు రూ.వేలు ఖర్చు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆకర్షించడం.. ప్రభుత్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ చదువులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో 23 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4,405 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పూర్వ ప్రాథమిక విద్యను కేవలం అంగన్‌వాడీ కేంద్రాల వరకే పరిమితం చేశారు.



2016 నుంచి 2018 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 277, పట్టణ ప్రాంతాల్లో 470 కలిపి జిల్లాలో 747 కేంద్రాల్ని విలీనంచేసి పూర్వ ప్రాథమిక విద్యను అమల్లోకి తెచ్చారు. అంగన్‌వాడీ మోడల్‌ ప్రీస్కూళ్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటికి తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈసారి ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో కాకుండా పాఠశాలల్లోనూ దీన్ని అమలు చేయబోతుంది. జిల్లాలో 831 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో నడుస్తున్నాయి.



వాటిలో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ విద్యా బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకే శిక్షణ ఇచ్చి బోధన చేయించాలా లేదా ఉపాధ్యాయులకు ఆ బాధ్యతల్ని అప్పగించాలా అనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చ సాగుతోంది. త్వరలో పూర్వ ప్రాథమిక విద్యా బోధన అమలుకు సంబంధించి పుస్తకాలు కూడా బడులకు రాబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో నడుస్తున్న 831 అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీ విద్యా బోధన అమలుకు విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ మనోరంజని 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు

0 comments:

Post a Comment

Recent Posts