Sunday, 27 September 2020

5 కోట్లు గెలిచాడు..రూపాయితో మిగిలాడు!

 *5 కోట్లు గెలిచాడు..రూపాయితో మిగిలాడు!* 



‘అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది. అదే దరిద్రం తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంది’ తెలుగు నాట ఈ నానుడి సుపరిచితమే. అదృష్టాన్ని అవకాశంగా మలుచుకొని ఒక్కోమెట్టు ఎక్కిన వారు కొందరైతే.. కాలరాసి కష్టాలపాలైన వారెందరో. రెండో కోవకు చెందిన వాడే బిహార్‌ ప్రాంతానికి చెందిన సుశీల్‌కుమార్‌. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ప్రసారమైన రియాల్టీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’లో రూ. 5 కోట్లు గెలుచుకున్నాడు. ఓ సాధారణ జీవితం నుంచి ఒక్కసారిగా కోటీశ్వరుడైన సుశీల్ కుమార్‌..5 ఏళ్లలో ఆ డబ్బంతా పోగొట్టుకొని పొట్ట కూటికోసం తిరిగి నెలకు రూ.18 వేలు ఇచ్చే ఓ ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా?

సుశీల్‌ కుమార్‌.. 2011లో చాలా మంది నోటనానిన పేరు. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’లో అన్ని రౌండ్లు దాటి అక్షరాలా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. అప్పటి వరకు సాధారణంగా బతికే అతడి లైఫ్‌స్టైల్‌ ఒక్కసారిగా సెలబ్రిటీని చేసింది. ఎక్కడికెళ్లినా ఆటోగ్రాఫ్‌లు, మీడియా కవరేజీలు, వాణిజ్య కార్యక్రమాలు. కాలం గిర్రున తిరిగింది. నడిమంత్రపు సిరి అతడిలో విపరీత మార్పులు తీసుకొచ్చింది. నెలలో దాదాపు 15 ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. దీంతో చదువుపై శ్రద్ధ తగ్గిపోయింది. అప్పటి వరకు నిజజీవితంలో బతికిన సుశీల్‌ ఊహల్లో తేలిపోయాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నారని మీడియావాళ్లు అడుగుతుంటే వ్యాపారం చేస్తున్నానని సమాధానం దాటవేసేవాడు. కానీ, అక్కడ చేసిందేమీ లేదు.



Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

 *నెలలో సగం రోజులు దిల్లీలోనే..* 

కష్టపడకుండా డబ్బులొస్తే వాటి విలువ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు. సుశీల్‌కుమార్‌ విషయంలోనూ అదే జరిగింది. ప్రతి నెలలోనూ దిల్లీ ట్రిప్‌ వేసేవాడు. అక్కడ జేఎన్‌యూ, ఐఐఎంసీ స్నేహితులతో జాలీగా తిరిగే వాడు. అడిగిన వారందరీ డబ్బులిస్తూ వృథా ఖర్చులకు పోయాడు. క్రమంగా జల్సాలకు అలవాటుపడ్డాడు. మందు, సిగరెట్‌ మొదలయ్యాయి. కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవాడు కాదు. ఇలా ఇంటిపట్టున ఉండకుండా జల్సాలకు పోవడంతో భార్యతో గొడవలు. అది చినికి చినికి గాలివానలా తయారై విడాకుల వరకు వెళ్లింది. అయితే పెద్దలు కలగజేసుకోవడంతో అది ఆగిపోయింది.

 *దిల్లీ నుంచి ముంబయి..* 

జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా సుశీల్‌ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. ఎవరో తెలిసిన ప్రొడ్యూసర్‌ ఉన్నాడని.. సినిమాలకు కథలు రాస్తానని చెప్పి ముంబయికి పయనమయ్యాడు. ఆసక్తి ఉన్నా.. అలవాటు లేనిపని కదా.. కథలు అంతగా రక్తికట్టలేదు. కొన్ని రోజులు టీవీ ఇండస్ట్రీలో పని చేసి తిరిగి రావాలని ఆయన సూచించాడు. దీంతో గేయ రచయిత అయిన మరో స్నేహితుడితో కలిసి ముంబయిలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడికెళ్లినా చెడు వ్యసనాలు మానలేదు. ఓ వైపు టీవీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు సినిమాలకు దర్శకత్వం చేయాలని ప్రయత్నించాడు. అవి కూడా బెడిసికొట్టాయి. ఈ లోపు తన వద్దనున్న రూ. కోట్లలో ఒక్కో సున్నా తగ్గిపోతూ చివరికి ‘సున్నా’ మిగిలింది. 


 *జీవితమేంటో అప్పుడు తెలిసింది..* 

ఐదు సంవత్సరాల తర్వాత గానీ సుశీల్‌ బుద్ధి మారలేదు. ఈ లోపు అదృష్టంతో వచ్చిన ధనమంతా మంచుముక్కలా కరిగిపోయింది. జల్సాల టైంలో భుజం తట్టిన స్నేహితులు ఇప్పుడు లేరు. కుటుంబ పోషణ కష్టమైంది.సెలబ్రిటీ పేరుతో కష్టాలతో బతుకీడ్చడం కంటే సాధారణ జీవనమే సుఖమనుకున్నాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి ఉపాధ్యాయుడిగా స్థిరపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2016 మార్చి నుంచి మద్యం మానేశానని చెబుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను సామాజిక మధ్యమం ఫేస్‌బుక్‌ వేదికగా సుశీల్‌ పంచుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు దానిని సక్రమంగా వినియోగించుకోకపోతే ఏమవుతుందో చెప్పడానికి సుశీల్ విఫలగాథ ఓ గుణపాఠమని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

0 comments:

Post a Comment

Recent Posts