Friday, 18 June 2021

ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 3 పోస్టులకు నో ఫిలిమ్స్!!

 గ్రూప్‌ - 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్‌ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్ష మాత్రమే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు.


ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్‌ వర్గాలు వివరించాయి.

అభ్యర్థులకు భారం... కోచింగ్‌ సెంటర్లకు లాభం
ప్రిలిమ్స్‌ నిర్వహణతో అభ్యర్థులు తీవ్ర ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్‌ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్‌ - 1 పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్‌ - 2, గ్రూప్‌ - 3 పోస్టులకు కేవలం ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం తమ వారికి చెందిన కోచింగ్‌ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానంలో మార్పులు చేసింది. గ్రూప్‌ -1 సహా అన్ని క్యాడర్‌ పోస్టులకూ ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో 4,009 పోస్టుల భర్తీకి కొత్త విధానంలో నోటిఫికేషన్లు ఇచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయడంతో పాటు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. ఉద్యోగాలు వదులుకుని మరీ పలువురు కోచింగ్‌ సెంటర్లకు డబ్బులు ధారపోశారు.కమిషన్‌ను శాసించిన కోచింగ్‌ మాఫియా
టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ పెద్దలకు సన్నిహితులైన వ్యక్తులు హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్లు నిర్వహిçస్తూ ఏపీపీఎస్సీపై పెత్తనం చలాయించారు. అప్పట్లో ఏపీపీఎస్సీని కోచింగ్‌ మాఫియా నడిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ ముఖ్యనేత, కమిషన్‌ సారథి సామాజిక వర్గానికి చెందిన కోచింగ్‌ సెంటర్‌ యజమాని నిర్ణయాలు ఏపీపీఎస్సీలో అమలయ్యేవి. వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఆ వ్యక్తి ప్రమేయముండేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ వారికి చెందిన కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందిన వారికి ఒకే పరీక్ష కేంద్రంలో, దాదాపు ఒకే గదిలో సీట్లు కేటాయించి మాస్‌ కాపీయింగ్‌కు వీలు కల్పించారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నల స్క్రీన్‌ షాట్లు పరీక్ష ప్రారంభమైన కొద్ది సమయానికే బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అర్హులను 1 : 50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని కూడా రద్దు చేసి నిరుద్యోగ అభ్యర్థులకు గత సర్కారు అన్యాయం చేసింది. దీన్ని 1 : 15కి కుదించడంతో అభ్యర్ధులకు నష్టం వాటిల్లింది. కమిషన్‌ తీరుపై ఎవరైనా ఆందోళనకు దిగినా, కోర్టులకు వెళ్లినా వారి పేర్లను బ్లాక్‌ లిస్టులో చేర్చారు. గత సర్కారు హయాంలో గ్రూప్‌ - 1 సహా పలు పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలు, తప్పుడు సమాధానాల ఆప్షన్లతో అస్తవ్యస్తంగా మార్చారు. ప్రశ్నలు, సమాధానాలు ఇంగ్లీషులో ఒక రకంగా, తెలుగులో మరోరకంగా ఉండటం అభ్యర్థులకు నష్టం చేసింది. గ్రూప్‌- 1, గ్రూప్‌- 2లో ఏకంగా 50కి పైగా ప్రశ్నలు తప్పుల తడకగా ఉండడంతో పరీక్షలను తిరిగి నిర్వహించాల్సిన పరిస్థితులూ ఉత్పన్నమయ్యాయి. గత ప్రభుత్వం, నాటి కమిషన్‌ నిర్ణయాలతో నోటిఫికేషన్లన్నీ న్యాయ వివాదాల్లో చిక్కుకుని పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్టుమెంట్‌ పరీక్షల్లో మైనస్‌ మార్కులు చేర్చి ఇబ్బందుకు గురి చేశారు.


అభ్యర్థులకు మేలు జరిగేలా..
కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్‌/ స్క్రీనింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతో పాటు కోచింగ్‌ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభ్యర్థులకు మేలు జరిగేలా కమిషన్‌ పలు చర్యలు తీసుకొంది. డిపార్టుమెంటు టెస్టుల్లో మైనస్‌ మార్కులను రద్దు చేసింది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిని 1 : 15 నుంచి 1 : 50కి మార్పు చేసింది. ఇలా పలు చర్యలు తీసుకున్న కమిషన్‌ తాజాగా గ్రూప్‌ - 1 మినహా ఇతర కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

వేగంగా పోస్టుల భర్తీ
టీడీపీ హయాంలో కమిషన్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, లోపాల కారణంగా పలు పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక కమిషన్‌ కార్యదర్శిగా నియమితులైన పీఎస్సార్‌ ఆంజనేయులు వాటిని పరిష్కరింపచేస్తూ త్వరితగతిన పోస్టులను భర్తీ చేపట్టారు. అతి తక్కువ వ్యవధిలోనే 2,310 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. 299 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, 1,051 పంచాయతీ కార్యదర్శులు, 192 జూనియర్‌ లెక్చరర్లు, 440 గ్రూప్‌-2 కేడర్‌ పోస్టులు, 49 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు, 32 ఫిషరీస్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్లు, 26 అగ్రికల్చర్‌ ఆఫీసర్లు, 87 గ్రేడ్‌ 2 ఈవోలు తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. ఇవికాకుండా 169 గ్రూప్‌ 1 పోస్టులు, 405 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు, 308 డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులు, 430 ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ పోస్టులతో కలుపుకొని మరో 1,800 వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

0 comments:

Post a Comment

Recent Posts