Tuesday, 29 June 2021

పదిలోని 30% + ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోని 70%వెయిటేజీతో ద్వితీయ సంవత్సర ఫలితాలు

 *📚✍పదిలోని 30% + ఇంటర్‌ ప్రథమలోని 70%వెయిటేజీతో ద్వితీయ ఫలితాలు*

*♦త్వరలో నివేదిక ఇవ్వనున్న కమిటీ*

*♦పదిపైనా ఛాయరతన్‌ ఛైర్‌పర్సన్‌గా కమిటీ ఏర్పాటు*


*🌻ఈనాడు, అమరావతి:* ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్‌ రెండో ఏడాది ఫలితాలకు.. ప్రథమ సంవత్సరం మార్కులతో పాటు పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల మదింపునకు నియమించిన ఛాయరతన్‌ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్ట్స్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులకే 70శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్‌ విద్యామండలి కోరింది. ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ బ్యాచ్‌ విద్యార్థులు గతేడాది పదోతరగతి పరీక్షలు రాయలేదు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. దీంతో వీరి ఫలితాల విడుదలకు ఏ విధానం పాటించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. మొదటి ఏడాదికి అందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇవ్వడమా? లేదంటే రెండో ఏడాది పరీక్షలు పూర్తయిన తర్వాత వాటి ఆధారంగా మొదటి ఏడాదికి మార్కులు ఇవ్వడమా? కరోనా తగ్గిన తర్వాత అంతర్గతంగా ఏమైన పరీక్షలు నిర్వహించడమా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.


*♦పదిపైనా కమిటీ ఏర్పాటు..:* పదో తరగతి ఫలితాల్లో అవలంబించాల్సిన విధానాలపై మంగళవారం కమిటీని ఏర్పాటు చేశారు. పదోతరగతికి సైతం విశ్రాంత ఐఏఎస్‌ ఛాయరతన్‌ ఛైర్‌పర్సన్‌గా కమిటీని నియమించారు. ఇందులో సుమారు 10మంది వరకు సభ్యులుగా ఉన్నారు. ఫలితాల విడుదలకు అవలంబించాల్సిన పద్ధతులపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు 2020-21లో ఒక్కో పరీక్షను 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. 2019లో పదిలో అంతర్గత మార్కుల విధానాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో పదో తరగతిలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవాలంటే గతంలో ఇచ్చిన వాటికి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment

Recent Posts