Saturday 26 June 2021

సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్సఫర్మేషన్‌- సాల్ట్‌ ప్రాజెక్టు ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు

 సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్సఫర్మేషన్‌- సాల్ట్‌ ప్రాజెక్టు ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు  

విద్యాభివృద్ధికి ‘సాల్ట్‌’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యాశాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్‌


 ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో “ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం” (సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్సఫర్మేషన్‌- సాల్ట్‌) అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు (ఇన్ఫ్రా)  ఎ.మురళి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య  పాల్గొన్నారు.ఐదేళ్లు (2021-22 సంవత్సరం నుండి 2026-27 వరకు) కాల పరిమితి కలిగిన ఈ పథకానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (IBRD) 250 మిలియన్ అమెరికన్ డాలర్ల (1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి అన్నారు. దీంతో రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయన్నారు.


ఈ పథకం ద్వారా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడం, సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి ముఖ్యమైన మూడు కీలక అంశాలపై దృష్టి సారించి, రాష్ట్రంలో అభ్యసనాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.  ఇది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు అని, మన రాష్ర్టంలో గత పదేళ్లలో ఇలాంటి ప్రాజెక్టు అమలు జరగలేదని పేర్కొన్నారు.  ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని మంత్రి చెప్పారు. 


ఇలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావడం గర్వకారణం అని కొనియాడారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సలహా సంస్థల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఏర్పాటయిన వైఎస్సార్‌ విజేత స్కూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పథకానికి చెందిన ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు, ఫలిత రంగాల కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు.

ప్రాజెక్టు ప్రధాన అభివృద్ధి లక్ష్యాలు

♦అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా బోధనా పద్ధతుల నాణ్యతను వృద్ధిపరచటం,  పాఠశాల నిర్వహణను బలోపేతం చేయడం.

♦పర్యావరణ మరియు సామాజిక నిబద్ధతా ప్రణాళికను అమలు పరచడం.

♦వాటాదారుల భాగస్వామ్య ప్రణాళికను అమలు చేయడం.

♦కార్మికుల నిర్వహణ ప్రణాళికను అమలుపరచడం.

*🔺ఫలితా రంగాల కార్యాచరణ ప్రణాళిక*

♦పునాది అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. 

♦ప్రారంభ శిశు సంరక్షణ విద్యను (ECCE) పాఠశాలకు అనుసంధానించటం. 

♦అంగన్వాడి ఉపాధ్యాయులకు శిక్షణ అందించటం. 

♦సామర్థ్యాల కేంద్రీకృత, ఆటపాటల- ఆధారిత బోధన నమూనాకు సహాయపడటం.

♦తరగతి గది అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటుగా పాఠశాల భద్రత, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలను కల్పించడం.  

♦ఆంధ్రప్రదేశ్ లోని 15వేల పాఠశాలలలో ‘నాడు-నేడు’ పనులను పూర్తిచేయడం. 

♦ప్రామాణిక ప్యాకేజీ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాలను మెరుగుపరచడం.

♦ప్రామాణిక సాధనాన్ని(Standardized tool) ఉపయోగించి తరగతి గది బోధనను పరిశీలించడం. 

♦LMS (లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ), SCERT, DIET లను అనుసంధానం చేయడం. 


♦ఉపాధ్యాయ శిక్షణలను నిర్వహించడం.

♦రాష్ట్ర స్థాయి సాధన మదింపు సర్వే నిర్వహించడం.

రూపొందించడ

♦రాష్ట్ర మదింపు బృందం ఏర్పాటు చేయడం

♦స్వీకృత అభ్యసన కార్యక్రమాలకు నిర్వహించడం.

♦తల్లిదండ్రుల కమిటీతో పాఠశాలలో సామాజిక తనిఖీని నిర్వహించడం.

♦పాఠశాల నాయకులకు  శిక్షణనివ్వడం.

♦విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం.

♦పాఠశాల భద్రత, విపత్తు ప్రమాద నిర్వహణ

♦పర్యావరణ మరియు సామాజిక అంశాల నిర్వహణ బృందం ద్వారా పర్యావరణ మరియు సామాజిక వ్యవస్థలను మదింపు చేయడం.

♦పాఠశాల పనితీరు మూల్యాంకన పట్టికలను  రూపొందించడం.    

♦సమగ్రమైన సామాజిక తనిఖీ విధానాన్ని అనుసరించడం.

పై కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుపరచడం ద్వారా మన రాష్ట్రం విద్యా పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించేందుకు వీలు కలుగుతుందని అన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts