శైలజా టీచర్... దేశంలో కరోనా జాడలను ముందుగానే పసిగట్టి సమర్థంగా కట్టడి చేసిన ఈ కేరళ మాజీ మంత్రి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైరస్ మొదటి దశ ఉద్ధృతిలోనూ, ఆపై సెకండ్ వేవ్‌లోనూ తన కట్టుదిట్టమైన కార్యాచరణతో కొవిడ్‌ను నియంత్రించారామె. వైరస్ వ్యతిరేక పోరులో 'రాక్‌స్టార్' మంత్రి'గా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న శైలజ కీర్తి కిరీటంలో తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు వచ్చి చేరింది. ప్రజారోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక 'ఓపెన్ సొసైటీ ప్రైజ్'కు ఆమె ఎంపికయ్యారు.
శైలజా టీచర్... దేశంలో కరోనా జాడలను ముందుగానే పసిగట్టి సమర్థంగా కట్టడి చేసిన ఈ కేరళ మాజీ మంత్రి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైరస్ మొదటి దశ ఉద్ధృతిలోనూ, ఆపై సెకండ్ వేవ్‌లోనూ తన కట్టుదిట్టమైన కార్యాచరణతో కొవిడ్‌ను నియంత్రించారామె. వైరస్ వ్యతిరేక పోరులో 'రాక్‌స్టార్' మంత్రి'గా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న శైలజ కీర్తి కిరీటంలో తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు వచ్చి చేరింది.
ప్రజారోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక 'ఓపెన్ సొసైటీ ప్రైజ్'కు ఆమె ఎంపికయ్యారు.
ప్రజారోగ్య సేవలకు గుర్తింపుగా!
తమ అసాధారణ సేవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న వారిని సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (సీఈయూ) ఏటా 'ఓపెన్ సొసైటీ ప్రైజ్'ను అందించి సత్కరిస్తోంది. 1994 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండి క్రిస్టలినా జార్జీవా, నోబెల్ గ్రహీతలు స్వెత్లానా, జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి ఎందరో ప్రముఖులు అందుకున్నారు. తాజాగా ఈ యూనివర్సిటీ 30వ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వర్చువల్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలోనే 'ఓపెన్ సొసైటీ ప్రైజ్-2021' పురస్కారానికి కేకే శైలజను ఎంపిక చేసినట్లు సీఈయూ అధ్యక్షులు తెలిపారు.
అలాంటి అమ్మాయిలకు ఆమె ఆదర్శం!
'దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో...అద్భుతమైన నాయకత్వ పటిమ, స్థానిక ప్రభుత్వాల సహకారంతో శైలజా టీచర్ ప్రజారోగ్య సేవలను సమర్థంగా నిర్వహించారు.
కరోనాను నియంత్రించడంలో ఆమె తీసుకున్న చర్యలు పలు దేశాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ప్రజా జీవితంలోకి రావాలని కలలు కంటోన్న ఎంతోమంది అమ్మాయిలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు' అని ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
మంత్రిగా ముందుచూపుతో!
సుమారు ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కొత్త మ్యూటెంట్లు, వేరియంట్ల పేరుతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఇక ఇండియాకు సంబంధించి భూతల స్వర్గంగా పేరు గాంచిన కేరళలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది.
జనవరి 30న వూహాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేరళతో పాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలకు భరోసానిచ్చారు శైలజ. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 'టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేట్' సూత్రాన్ని పక్కాగా అమలు చేశారు. విమానాశ్రయాల్లో పకడ్బందీగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
చైనా నుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్వారంటైన్ నిబంధనలను కట్టుదిట్టం చేశారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఐసొలేషన్ వార్డులకు తరలించారు. సోషల్ డిస్టెన్స్, మాస్కుల వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. వైరస్ మొదటి దశ, రెండో దశ ఉద్ధృతిని కేరళ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనడంలో శైలజదే కీలక పాత్ర అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ 'వోగ్ ఇండియా' శైలజకు ఘనమైన గుర్తింపునిచ్చింది. 'ఉమన్ ఆఫ్ ది ఇయర్-2020'గా గౌరవిస్తూ తమ ఎడిషన్ కవర్ పేజీపై ఆమె ముఖ చిత్రాన్ని ప్రచురించింది. అంతకుముందు పలు అంతర్జాతీయ సంస్థలు, పత్రికలు ఆమె కృషిని ప్రశంసించాయి.
'బ్రింగ్ బ్యాక్ శైలజా టీచర్'..!
కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి విజయన్ నాయకత్వంలో 21 మంది కొత్త మంత్రులతో కొత్త క్యాబినెట్ ఏర్పాటైంది.
ఈ క్రమంలో తన నియోజక వర్గం నుంచి 60 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన శైలజకే రెండోసారి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అనుపమా పరమేశ్వరన్, మాళవిక మోహనన్, పార్వతి లాంటి సినీతారలతో పాటు పలువురు ప్రముఖులు శైలజకు మద్దతుగా నిలిచారు. ఆమెను తిరిగి క్యాబినెట్ లోకి తీసుకోవాలని కోరారు.
నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా #BringBackShailajaTeacher, #BringOurTeacherBack లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు. అయితే ఇది పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, దీనిపై తనకెలాంటి విచారం లేదని...పదవి ఉన్నా, లేకపోయినా తన సేవలు కొనసాగుతాయని చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నారీ టీచరమ్మ.
నాకు వైద్యం తెలియదు!
కరోనా నియంత్రణకు సంబంధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న 63 ఏళ్ల శైలజ వైద్యురాలేమీ కాదు. అంతేకాదు.. ఆమె మంత్రి పదవిని చేపట్టడం కూడా అదే మొదటిసారి.
కేరళలోని కన్నూర్ జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పని చేశారు. కళాశాలలో చదువుతున్నప్పుడే సీపీఐ(ఎం) భావజాలం పట్ల ఆకర్షితురాలైన ఆమె ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరారు. 2004లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలైన ఆమె కూతుపరంబా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు . మంత్రిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ చాలామంది ఆమెను శైలజా టీచరనే పిలుస్తారు. ఆమె ట్విట్టర్ హ్యాండిల్ కూడా 'శైలజ టీచర్' పేరుతోనే కనిపిస్తుంది.
'నిఫా'ను నియంత్రించి!
కరోనా కన్నా ముందు 2018లో నిఫా వైరస్ కేరళను కుదిపేసింది.
అయితే ఆ సమయంలో చురుగ్గా స్పందించిన శైలజ అప్పటికప్పుడు 40 వేలమంది వలంటీర్లను ప్రజారోగ్య విభాగంలోకి తీసుకున్నారు. వైద్యులు, అధికారులతో కలిసి పనిచేసి నిఫా వైరస్‌ను సాధ్యమైనంతవరకు నియంత్రించగలిగారు. ఆ సమయంలో ఆమె చేసిన కృషిని దేశమంతా అభినందించింది. ఈ క్రమంలో కేరళలో నిఫా వైరస్ విజృంభణ మీద మలయాళంలో 'వైరస్' అనే సినిమా వచ్చింది. ఇందులో శైలజను పోలిన పాత్రను వెండితెరపై కూడా చూపించడం విశేషం. ఆ పాత్రను ప్రముఖ నటి రేవతి పోషించారు. ఇక రెండేళ్ల క్రితం కేరళలో సంభవించిన వరదల్లో ప్రాణనష్టం సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు శైలజ.
0 comments:
Post a Comment