Jagananna Thoduఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణంనేడు విడుదల
Jagananna Thodu : కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ హామీలన్నీ నెరవేరుస్తున్నారు. పేదలకు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాల కింద లబ్దిదారులకు ఆర్థిక సాయం చేశారు. తాజాగా జగనన్న తోడు పథకం కింద రెండో విడత డబ్బులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు.
దాదాపు 3.7లక్షల మంది చిరు వ్యాపారులు, వృత్తి కళాకారులు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాన్ని అకౌంట్లలో వేయనున్నారు. ఇందుకోసం రూ.370కోట్లు ఖర్చు చేయనుండగా, ఆ మొత్తంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రెండు దశలకు రూ.905 కోట్లు కేటాయించగా, రూ.49.77 కోట్ల వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తోంది.
తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్.
నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చినట్లు అవుతుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వమే వాలంటీర్ల ద్వారా గుర్తించింది. 9లక్షల 5వేల 630 మందిని గుర్తించగా.. వీరిలో ఇప్పటికే 5,35,172 మందికి రుణాలు ఇచ్చారు. కాగా, ఈ జాబితాలో పేరు లేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదని, వాలంటీర్‌ను సంప్రదించినా లేక గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేసినా.. 3 నెలల్లో అర్హులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా తెలిపారు.
Nelakosigi.KURUVA Mallayya
ReplyDelete