3,627 బడుల్లో నూతన విద్యా విధానం
3,178 ఉన్నత పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతుల తరలింపు
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు
జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వీటిని ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో జిల్లా విద్యాధికారులు, సంయుక్త సంచాలకులతో నిర్వహించిన కార్యశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,178 ఉన్నత పాఠశాలలకు 3,627 ప్రాథమిక బడుల నుంచి తరగతులు తరలిస్తారు. ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉన్నవి 939, సమీపంలో 521, ఇక 50-250 మీటర్లలోపు దూరంలో 2,167 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల నుంచి రెండు ఉపాధ్యాయ పోస్టులను హైస్కూల్‌కు మార్పు చేస్తారు.
వీటిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరిస్తారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు సరిపడా ఉంటే వారితోనే 3-10 తరగతుల వరకు బోధన చేయిస్తారు. ఒకవేళ తక్కువగా ఉంటే అర్హతలున్న ఎస్జీటీలతో బోధింపచేస్తారు. వీరి సర్వీసు నిబంధనలు, వేతన బిల్లులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేస్తారు.
గదుల కొరత ఉంటే ప్రస్తుత ప్రాథమిక పాఠశాలలోనే తరగతులు నిర్వహిస్తారు. బోధన షెడ్యూల్‌ను మాత్రం ప్రధానోపాధ్యాయుడే రూపొందిస్తారు. అంగన్‌వాడీలను సమీపంలోని ప్రాథమిక బడులకు తరలించి, ఫౌండేషన్ పాఠశాలలుగా మార్పు చేస్తారు.
0 comments:
Post a Comment