ఏపీకి కేంద్రం షాక్ .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్ల ఆహ్వానం .. నోటిఫికేషన్ జారీ !!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ మినహాయించి అఖిలపక్ష పార్టీలు కేంద్రం తీరును నిరసిస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహా నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి తీర్మానం చేసింది.కానీ తాజాగా కేంద్రం మరోమారు తన నిర్ణయాన్ని మార్చుకోబోము అన్న విషయాన్ని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి వేగంగా అడుగులు వేస్తుంది.
*వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్ల ఆహ్వానం.. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు*
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమ్మకానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. అమ్మకానికి షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా లీగల్ అడ్వైజ,ర్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ లను నియమించింది కేంద్రం.
ఒకపక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించేది లేదని స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలను, అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
*నిన్నటి నుండే టెండర్ల ప్రక్రియ షురూ*
జూలై 7 నుండి టెండర్లు ఆహ్వానిస్తూ బిడ్డింగ్ ప్రారంభించారు. ఈ బిడ్ లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. 15వ తేదీన ప్రీ-బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు.
ఆపై 28వ తేదీన బిడ్ సమర్పణ చివరి తేదీగా నిర్ణయించారు. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటించనున్నారు. బిడ్ లలో పాల్గొనడానికి రూ .1 లక్ష డిపాజిట్ మరియు 1 కోటి రూపాయల ఆర్థిక సంస్థ హామీ ఇవ్వాలని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇందులో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంట్ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.
*విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలు అమ్మకానికి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న 100 శాతం అనుబంధ సంస్థలను సైతం విక్రయిస్తామని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ గనులు అదనంగా విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ పై పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే పలు మార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష పార్టీ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రానికి లేఖలు రాశారు.
ఈ ఏడాది చివరకల్లా ప్రైవేటీకరణ పూర్తి చెయ్యాలని చూస్తున్న కేంద్రం
ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం ఈ ఏడాది చివరికల్లా ప్రైవేటీకరణను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా వెనక్కి తగ్గడం లేదు .
కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గణనీయమైన పాత్ర పోషించింది. ఇక ఈ నేపథ్యంలోనైనా కేంద్రం ఆలోచిస్తోందని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతోంది.
అందులో భాగంగా ప్రైవటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సలహాదారులను నియమించింది. వీరిలో ఒకరు లావాదేవీల సలహాదారు కాగా మరొకరు న్యాయసలహాదారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర ఇదే
సుదీర్ఘమైన చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఒకసారి గమనిస్తే ఏప్రిల్ 17, 1970 న, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పార్లమెంటులో విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని ప్రకటించారు.
ఇక ఈ ప్లాంట్ నిర్మాణం కోసం కురుపాం భూస్వాములు 6,000 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. తరువాతి సంవత్సరం, జనవరి 20, 1971 న, ఇందిరా గాంధీ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) ను తయారుచేసే విధిని మెస్సర్ కు అప్పగించారు. ఎంఎన్ దస్తూర్ & కో. సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదికను విడుదల చేసింది. 1977 లో, జనతా ప్రభుత్వ హయాంలో వెయ్యి కోట్ల రూపాయల మంజూరుతో పనులు ప్రారంభించారు.
స్టీల్ ప్లాంట్ పై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు
ప్లాంట్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 1981 లో సోవియట్ రష్యా సహాయంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1990 లో ఉక్కు తయారీ ప్రారంభమైంది.
మరో రెండేళ్లతర్వాత పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ 26,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. దీని సామర్థ్యం సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నులు.
ఇందులో సుమారు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు , 17,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా మరో లక్ష మంది వ్యక్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు.
విశాఖ ఉక్కు కోసం కొనసాగుతున్న ఉద్యమం .. జగన్ సర్కార్ ఏం చెయ్యబోతుంది ?
*ఇంత మందికి జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించడం సమంజసం కాదని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని నేటికీ విశాఖలోని కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.*
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కార్మిక సంఘాలు ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అడుగులపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం చేయబోతున్నారు...
ఏపీ లోని రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడానికి ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఏపీ సర్కార్ ఏం చెయ్యబోతుంది అనేది తెలియాల్సి ఉంది...
0 comments:
Post a Comment