Group-2 నోటిఫికేషన్ జారీ.. కొలువులు ఎన్నంటే..!
783 కొలువులు
మునిసిపల్ కమిషనర్లు, సీటీవో, తహసీల్దార్, ఎంపీవో, ఎక్సైజ్ ఎస్సైలు
18 నుంచి ఫిబ్రవరి 16 దాకా దరఖాస్తులు..
మే తర్వాతే రాత పరీక్షలు
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్-2 పోస్టుల(Group-2 posts)ను భర్తీ చేయాలని ప్రభుత్వం(Telangana Government) నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(Telangana State Public Service Commission) (టీఎస్‌పీఎస్సీ) గురువారం ప్రత్యేక నోటిఫికేషన్‌ను(28/2022) జారీ చేసింది.
ఇందులో మొత్తం 18 విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. మునిసిపల్ కమిషనర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి.
ఇందులో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగంలో సుమారు 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, మండల పంచాయతీ అధికారుల పోస్టుల కూడా 126 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం పోటీ పడే అభ్యర్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది మే నెల లేదా ఆ తర్వాత రాత పరీక్షను(TSPSC) నిర్వహించే అవకాశం ఉంది. రాత పరీక్ష ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. మిగిలిన అన్ని రకాల పోస్టుల మాదిరిగానే గ్రూప్-2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూ (Interview) పద్ధతిని రద్దు చేశారు.
దాంతో రాత పరీక్షలో ప్రతిభను కనబరిచే అభ్యర్థులను ఈ పోస్టుల కోసం ఎంపిక చేయనున్నారు. రాత పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ కమిషన్ తర్వాత ప్రకటించనుంది. ఇప్పటికే నోటిఫికేషన్లను జారీ చేసిన గ్రూపు-1, గ్రూపు-4 పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూపు-2 పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Examination)ను నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో వీటి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
అనంతరం గ్రూపు-1 పోస్టులకు సంబంధించిన మెయిన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అలాగే... గ్రూపు-4 పోస్టుల భర్తీ కోసం కూడా పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 15వ తేదీన మొదలయ్యే ఈ పరీక్షలు, ఏప్రిల్ 13వ తేదీతో ముగుస్తాయి.
ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారంలో గ్రూపు-1 మెయిన్, గ్రూపు-4 పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. మే మాసంలో గ్రూపు-2 పరీక్షలు నిర్వహించే వీలు కనిపిస్తున్నది.
భారీగా దరఖాస్తులు
గ్రూపు-2 పోస్టుల కోసం పోటీ పడే అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు సుమారు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
గ్రూపు-1 పోస్టులతో పోలిస్తే... గ్రూపు-2 పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పోస్టుల సంఖ్య కూడా ఎక్కువే. గ్రూపు-1 ప్రిలిమినరీలో ప్రతిభ కనబరిస్తే... మెయిన్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మెయిన్‌లో చాటే ప్రతిభ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
గ్రూపు-2లో ఒకే పరీక్ష ఉంటుంది. అధికారుల అంచనా ప్రకారం... గ్రూపు-2 పోస్టుల కోసం 4 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా పరీక్షలను నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన తర్వాతే పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
Thyroid: మీకు థైరాయిడ్ సమస్య ఉందా.. అయితే ఈ ఆహారం తీసుకోండి..
0 comments:
Post a Comment