Sunday, 1 January 2023

బూస్టర్‌ డోస్‌ను ఎవరు, ఎప్పుడు తీసుకోవాలి.. డాక్టర్ల క్లారిటీ

బూస్టర్‌ డోస్‌ను ఎవరు, ఎప్పుడు తీసుకోవాలి.. డాక్టర్ల క్లారిటీ. కరోనా రీ ఎంట్రీతో మళ్లీ అందరి దృష్టి వ్యాక్సినేషన్‌పై పడింది. 

మొన్నటి వరకు బూస్టర్‌ తీసుకునేందుకు వెనుకంజ వేసిన జనం.. ఇప్పుడు బీఎఫ్‌-7 వేరియంట్‌ కలకలంతో టీకా కేంద్రాలకు క్యూ కడుతున్నారు.


అయితే బూస్టర్‌ విషయంలో చాలా మందికి వివిధ రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వైరస్‌ తగ్గుముఖం పట్టింది కదా అని కొందరు.. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నందున ఇక బూస్టర్‌ ఎందుకని మరికొందరు.. అసలు బూస్టర్‌ డోస్‌ను ఎవరు, ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై మరికొందరు అయోమయానికి గురవుతున్నారు. 

అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్‌ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే బూస్టర్‌ డోస్‌ తీసుకున్నవారు సైతం మరోసారి తీసుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.



18 ఏండ్లు దాటినవారంతా తీసుకోవచ్చు..
కరోనా వచ్చినా, రాకపోయినా మొదటి రెండు డోసులతో పాటు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి. 

దీంతో ఆ వైరస్‌ను తట్టుకునే ప్రతిరక్షకాలు (యాంటిబాడీస్‌) శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత వైరస్‌ దాడిచేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. దవాఖానలో చేరాల్సినంత అవసరం రాదు. సాధారణంగా ఒకసారి వ్యాక్సిన్‌ తీసుకున్న కొంత కాలం తర్వాత యాంటిబాడీస్‌ తగ్గుముఖం పడుతున్నట్టు పలు అధ్యయనాల్లో తేలడంతో బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి అయింది. 

18 ఏండ్లు పైబడిన వారంతా బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చు. మొదటి రెండు డోసులు తీసుకున్న 6 నెలలకు బూస్టర్‌ తీసుకోవాలి. ఆ మధ్యలో కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైతే మరో 3-4 నెలల గ్యాప్‌ ఇవ్వాలి.

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

బూస్టర్ల మధ్య 6-9 నెలల గ్యాప్‌ ఉండాలి
ఒకసారి కొవిడ్‌ టీకా తీసుకుంటే దాని ప్రభావం 6 నుంచి 9 నెలలపాటు ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల మొదటి రెండు డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత తొలి బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి.

 ఆ తర్వాత 6-9 నెలలకు రెండవ బూస్టర్‌ తీసుకోవచ్చు. యాంటిబాడీస్‌ తక్కువగా ఉన్నవారు కచ్చితంగా బూస్టర్‌ తీసుకోవాల్సిందే. బూస్టర్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ వల్ల ఇన్‌ఫెక్ట్‌ అయితే మరో 5-6 నెలలు ఆగాలి. 

ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ వల్ల శరీరంలో సహజంగానే యాంటిబాడీస్‌ తయారవుతాయి. వీటితో ఎక్కువ కాలం రక్షణ ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఎన్ని టీకాలు తీసుకున్నా కరోనా జాగ్రతలను మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే.
- డాక్టర్‌ శివరాజు, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌ హాస్పిటల్‌

ఏటేటా బూస్టర్‌ తీసుకోవడం ఉత్తమం
ఫ్లూ వ్యాక్సిన్ల మాదిరిగా ఏటా కరోనా బూస్టర్‌ టీకా తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం వైరస్‌ ఉనికి పూర్తిగా తొలగిపోనందున కనీసం మరో మూడు నాలుగు సంవత్సరాలపాటు ఏడాదికోసారి బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే మంచిది. 


బూస్టర్‌ విషయంలో క్రాస్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మొదటి రెండు డోసులు ఒకే కంపెనీకి చెందిన టీకాలు తీసుకుంటే బూస్టర్‌గా వేరే కంపెనీ టీకా తీసుకోవాలి. తద్వారా ఎక్కువ యాంటిబాడీస్‌ ఉత్పత్తి కావడమే కాకుండా చాలా కాలంపాటు రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

- డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఏఐజీ దవాఖాన

బూస్టర్‌ డోస్‌ను ఎవరు, ఎప్పుడు తీసుకోవాలి.. డాక్టర్ల క్లారిటీ

0 comments:

Post a Comment

Recent Posts